Home  »  Featured Articles  »  రంగా హత్య తర్వాత థియేటర్లు, డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీసుల ధ్వంసం వెనుక అసలు నిజాలివే.!

Updated : Jul 21, 2026

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా అనే పేరు ఒక సంచలనం. ఆయన భౌతికంగా దూరమై 36 ఏళ్లు గడుస్తున్నా, బెజవాడ రాజకీయాల్లో మరియు ప్రజల గుండెల్లో ఆ పేరు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. డిసెంబర్ 26వ తేదీ రాత్రి ఊహించని రీతిలో రంగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్త తెలియగానే విజయవాడ నగరంతో పాటు కోస్తాంధ్ర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రంగా అభిమానులు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఆ ఆవేశం కాస్తా తీవ్ర విధ్వంసానికి దారితీసింది.

రంగా హత్య అనంతరం జరిగిన ఆందోళనల్లో ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందిన ఆస్తులే లక్ష్యంగా దాడులు జరిగాయి. విజ‌య‌వాడ సినీ రంగానికి కేంద్ర బిందువైన సినిమా థియేటర్లు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులపై దుండగులు విరుచుకుపడ్డారు. గాంధీనగర్‌లోని ప్రముఖ థియేటర్లు, పంపిణీ సంస్థల కార్యాలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. గాంధీనగర్ ముఖద్వారంగా పేరుగాంచిన అలంకార్ థియేటర్‌పై జరిగిన దాడిలో విదేశీ ప్రొజెక్టర్లు, ఖరీదైన ఫర్నిచర్, రూఫింగ్ కాలిబూడిదయ్యాయి. ఈ ఒక్క థియేటర్‌లోనే దాదాపు 50 లక్షల రూపాయల మేర తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ, ఆ సమయానికి కేవలం 25 లక్షల రూపాయలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండటంతో యజమానులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అలంకార్ థియేటర్ యజమాని పర్వతనేని ప్రభాస్ తమ థియేటర్ టికెట్ల వెనుక తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రింట్ చేయించడమే దాడులకు ప్రధాన కారణమని నాటి వర్గాలు పేర్కొన్నాయి.

ఇదే తరహాలో గాంధీనగర్‌లోనే ఉన్న కళ్యాణ చక్రవర్తి థియేటర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ థియేటర్ నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వయానా తమ్ముడైన త్రివిక్రమరావుకు చెందినది కావడంతో దుండగులు దానిపై దాడి చేసి నిప్పు పెట్టారు. థియేట‌ర్ లోపల ఉన్న సామగ్రి అంతా కాలిపోయింది. అలాగే విజయవాడలోనే ఎంతో పురాతనమైన దుర్గా కళామందిరం థియేటర్‌లోనూ భయానక విధ్వంసం జరిగింది. దుండగులు లోపలికి చొరబడి గోడలపై ఉన్న ఎన్టీఆర్ పోస్టర్లను, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. ఈ దాడి వల్ల దాదాపు 40 లక్షల రూపాయల నష్టం సంభవించగా, అక్కడ కేవలం 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మాత్రమే కవర్ అయింది. విజయా సంస్థ చిత్రాలన్నింటికీ కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ థియేటర్ యజమాని, పంపిణీదారుడు సిహెచ్ హరనాథ బాబు, గతంలో ఎన్టీఆర్ విజయవాడ వచ్చినప్పుడు తమ గెస్ట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇవ్వడమే తాము చేసిన తప్పా అని ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

విధ్వంసం ఇక్కడితో ఆగలేదు. గవర్నర్‌పేట సెంటర్‌లోని జంట థియేటర్లయిన అన్నపూర్ణ, శకుంతలలపై డిసెంబర్ 27వ తేదీన ఏకంగా మూడు సార్లు దాడులు జరిగాయి. ఉదయం 6:30 గంటలకు మొదటిసారి, ఉదయం 10:00 గంటలకు రెండోసారి, మధ్యాహ్నం 3:00 గంటలకు మూడోసారి దుండగులు విరుచుకుపడ్డారు. ఈ వరుస దాడుల్లో అన్నపూర్ణ థియేటర్ పాక్షికంగా నష్టపోగా, శకుంతల థియేటర్ మాత్రం తీవ్రంగా దెబ్బతింది. బిసెంట్ రోడ్డులోని అప్సరా థియేటర్‌లోని ఫర్నిచర్‌ను తగలబెట్టడమే కాకుండా, అక్కడ ప్రదర్శితమవుతున్న నందమూరి బాలకృష్ణ చిత్రం 'రక్తాభిషేకం' ఫిలిం రీళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. బెంచ్ సర్కిల్‌లోని జ్యోతి థియేటర్ పూర్తిగా ధ్వంసమైంది. గవర్నర్‌పేటలోని లక్ష్మి, విజయ, అలాగే గాంధీనగర్‌లోని శైలజ, శాంతి, జయరామ్, సీతారామ థియేటర్లతో పాటు బందరులోని రాధికా థియేటర్, ఉయ్యూరులోని లక్ష్మీ టాకీస్‌లపై కూడా దాడులు జరిగాయి. అయితే, గాంధీనగర్‌లోనే ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డికి చెందిన రాజ్, యువరాజ్ థియేటర్ల జోలికి దుండగులు వెళ్లకపోవడం గమనార్హం.

ఈ దాడుల పరంపరలో విజయ సురేష్, నవయుగ, లక్ష్మీ ఫిలిమ్స్, వైజయంతి ఫిలిమ్స్, లక్ష్మీ చిత్ర వంటి అనేక ప్రముఖ పంపిణీ సంస్థల కార్యాలయాలు కూడా సర్వనాశనమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో విజయవాడ నగరంలో ప్రభుత్వం ఏకంగా నెల రోజుల పాటు సుదీర్ఘ కర్ఫ్యూ విధించింది. థియేటర్లు, పంపిణీ సంస్థలు మూతపడటం, షోలు రద్దు కావడంతో పాటు జరిగిన ఆస్తి నష్టాన్ని లెక్కిస్తే నాటి కాలంలోనే దాదాపు పాతిక కోట్ల రూపాయలుగా తేలింది. ఆనాటి నల్లటి జ్ఞాపకాలు ఇప్పటికీ విజయవాడ సినీ చరిత్రలో ఒక చేదు అధ్యాయంగా మిగిలిపోయాయి. ప్రతి ఏటా డిసెంబర్ 27వ తేదీ రాగానే నాటి ఘోర కలి సృష్టించిన బీభత్సం విజయవాడ ప్రజలకు, సినీ ప్రియులకు మళ్లీ కళ్లముందు మెదులుతుంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.